Sesham Mike -Il Fathima
Movie Name: Sesham Mike -Il Fathima
Release Date: 2023-12-15
Cast: Kalyani Priyadarshan,Shaheen Siddique, Gautham Vasudev Menon,Aneesh G. Menon, Sabumon Abdusamad, Sudheesh
Director:Manu C. Kumar
Producer: Sudhan Sundaram
Music: Hesham Abdul Wahab
Banner: Passion Studios
Rating: 2.75 out of 5
మలయాళ సినిమాగా 'శేషమ్ మైక్ - ఇల్ ఫాతిమా'
నవంబర్ 17న థియేటర్లకు వచ్చిన సినిమా
టైటిల్ రోల్ ను పోషించిన కల్యాణి ప్రియదర్శన్
నిన్నటి నుంచే మొదలైన స్ట్రీమింగ్
ఒక యువతి ఆశయసాధన చుట్టూ అల్లుకున్న కథ ఇది
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మొదలు క్రీడా రంగానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఏ క్రీడా నేపథ్యాన్ని ఎంచుకున్నా ఆటగాళ్లుగా ఎదగాలనే ప్రయత్నంతో ప్లేయర్స్ ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. అలాంటిది ఒక యువతి కామెంటేటర్ కావాలని అనుకుంటుంది ... అదీ ఫుట్ గేమ్ కి సంబంధించి. అలాంటి ఒక కథతో రూపొందిన మలయాళ సినిమానే 'శేషమ్ మైక్ - ఇల్ ఫాతిమా'. 'నెట్ ఫ్లిక్స్'లో నిన్నటి నుంచి తెలుగులోను స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
ఫాతిమా (కల్యాణి ప్రియదర్శన్) చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే పనిగా మాట్లాడుతూ ఉండటం వలన, అందరూ 'వాగుడుకాయ' అని పిలుస్తూ ఉంటారు. ఆమె తండ్రి మునీర్ (సుధేశ్) అన్నయ్య ఆసిఫ్ (అనీష్) మెకానిక్ షెడ్ నడుపుతూ ఉంటారు. తల్లి (ప్రియా శ్రీజిత్) ఆ కుటుంబాన్ని పద్ధతిగా నడుపుతూ ఉంటుంది. మునీర్ పరువు ప్రతిష్ఠలే ప్రాణంగా భావిస్తూ ఉంటాడు. తమకి వచ్చిన ఆదాయంతో ఆ కుటుంబానికి హాయిగా గడిచిపోతూ ఉంటుంది.
ఫాతిమాకి చిన్నప్పటి నుంచి ఫుట్ బాల్ అంటే ఇష్టం. మగపిల్లలు తనని ఆడనీయనందున, వాళ్లు ఆడుతూ ఉంటే తాను కామెంట్రీ చెబుతూ ఉండేది. కాలేజ్ రోజులకు చేరుకునే సరికి, ఫుట్ బాల్ టోర్నమెంట్స్ కి కామెంటేటర్ గా ఆమెకి మంచి గుర్తింపు వస్తుంది. దాంతో ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యవహరించాలనే ఒక కోరిక ఆమెలో బలపడుతుంది. ఆ దిశగా ఆమె తన ప్రయత్నాలు మొదలుపెడుతుంది.
ఫాతిమా అలా జనాల్లోకి వెళ్లడం పట్ల కుల పెద్దలు విమర్శిస్తారు. దాంతో మునీర్ ఆమెకి పెళ్లి సంబంధాలు తీసుకురావడం మొదలుపెడతాడు. అయితే తన కాళ్లపై తాను నిలబడిన తరువాతనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె 'కొచ్చి' వెళుతుంది. అక్కడ తనకి తెలిసిన ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉంటూ, తన ప్రయత్నాలు తాను చేయడం మొదలుపెడుతుంది. ఆ సమయంలోనే ఫుట్ బాల ఆటగాడిగా, చేయని తప్పుకి నిషేధాన్ని ఎదుర్కున్న సొలొమన్ (షాహిన్ సిద్ధికీ)తో పరిచయం అవుతుంది.
ఇంటెర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరించడం కోసం, అందుకు సంబంధించిన జయేశ్ - గోపకుమార్ లను ఫాతిమా కలుస్తుంది. ఆమెను జయేశ్ నలుగురిలో అవమానిస్తాడు. ఇక గోపకుమార్ ఆమెను ఇంటికి పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అక్కడే ఆమె అతనికి తనదైన స్టైల్లో బుద్ధి చెబుతుంది. ఇక జయేశ్ కి సొలొమన్ తన మార్క్ గుణపాఠం చెబుతాడు. దాంతో జయేశ్ - గోపకుమార్ ఒక్కటై, ఫాతిమాకి ఎవరినీ కలిసే అవకాశం లేకుండా చేస్తుంటారు.
అంతేకాదు .. నిషేధానికి గురైన ప్లేయర్ సోలొమన్ తో ఫాతిమా ప్రేమలో పడినట్టుగా పేపర్లో వచ్చేలా చేస్తారు. ఈ విషయం ఫాతిమా తండ్రి దృష్టికి వెళుతుంది. తాను వద్దని చెప్పినా వినకుండా వెళ్లి, ఇలా తన పరువు తీస్తుందంటూ ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఆ తరువాత అతను ఏం చేస్తాడు? ఫాతిమా ప్రయత్నం ఫలిస్తుందా? ఆమె కామెంటేటర్ కాకుండా అడ్డుకోవాలనే జయేశ్ - గోపకుమార్ పట్టుదల నెరవేరుతుందా? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.
ఈ సినిమాకి రచయిత - దర్శకుడు మను సి.కుమార్. నాయిక ప్రధానంగా ఆయన రాసుకున్న కథ ఇది. ప్రధానమైన పాత్రలో కల్యాణి ప్రియదర్శన్ కనిపిస్తుంది. ఫాతిమా బాల్యం .. ఆమె ఆశయం .. తన ఆశయ సాధనలో ఆమెకి ఎదురైన ఇబ్బందులు .. ఆమె వాటిని అధిగమించిన విధానంతో ఈ కథ ముందుకు వెళుతుంది. లవ్ ... యాక్షన్ .. రొమాన్స్ .. కామెడీకి దూరంగా ఈ కథ నడుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బయోపిక్ మాదిరిగానే సీరియస్ గా సాగుతుంది.
ఫుట్ బాల్ గేమ్ .. కామెంటేటర్ కావాలనే ఆశయం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. క్రీడా పరంగా చూసుకుంటే, ఒక యువతి అనేక అడ్డంకులను అధిగమిస్తూ తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం స్ఫూర్తిని కలిగిస్తుంది. కానీ ఒక సినిమాగా చూసినప్పుడు మాత్రం, ఆశించినస్థాయి వినోదం పాళ్లు అందక ప్రేక్షకులు కాస్త అసంతృప్తికి లోనవుతారు. క్లైమాక్స్ తో పాటు అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకుంటాయి. మిగతా సన్నివేశాలు అలా తాపీగా ... నిదానంగా సాగుతుంటాయి.
కల్యాణి ప్రియదర్శన్ నటన ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి. తాను చాలా యాక్టివ్ గా కనిపిస్తూ, సహజంగా నటించింది. ఇక మిగతా వాళ్లంతా పాత్ర పరిధిలో మెప్పించారు. హేషమ్ నేపథ్య సంగీతం ప్రధానమైన బలంగా నిలిచింది. సంతాన కృష్ణన్ కెమెరా పనితనం .. కిరణ్ దాస్ ఎడిటింగ్ ఓకే. కథలోని క్రీడా స్ఫూర్తికి సంబంధించిన లైన్ బాగుంది. కానీ దానికి వినోద ప్రధానమైన అంశాలను కూడా జోడించి ఉంటే, ఈ సినిమా మరో మెట్టుపైన కనిపించి ఉండేదేమో.
0 Comments